తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఇంధన ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరుకుంది. శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ-LIOC పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే.. దానికి అనుగుణంగా శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ- సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (CPC) సైతం సోమవారం అర్ధరాత్రి రేట్లను పెంచింది. 92 ఆక్టేన్ పెట్రోల్ ధరను 84 రూపాయల మేర సీపీసీ పెంచింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరుకుంది.
శ్రీలంకలో గత ఆరునెలల కాలంలో LIOC ఇంధన ధరలను పెంచడం ఇది ఐదోసారి కాగా, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నెల వ్యవధిలో రెండు సార్లు పెట్రోల్ రేట్లను పెంచింది. ఇప్పటికే ఇంధన, ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నప్రజలు.. తాజా పెంపుతో మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అయితే తాము బతికేదెలా అంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వమే ఉచితంగా ఆహారం, నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.