Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జగ్గారెడ్డి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, జగ్గారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారనే చర్చ జరుగుతున్నది. ఇటీవల కాలంలో జగ్గారెడ్డి టీఆర్ఎస్ యువ నేత కేటీఆర్‌తో చర్చలు చేశారని, ఈ సందర్భంగా ఆయన గులాబీ గూటికి వెళ్తారనే ఊహాగానాలు వినబడుతున్నాయి.
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటీఆర్‌తో జగ్గారెడ్డ చర్చలు జరపారని, అలా సన్ని హితంగా మెలగడంలో తప్పులేదని కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే జగ్గారెడ్డి వ్యవహార శైలి కూడా మిగతా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కంటే చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వచ్చిన వార్తలపై జగ్గారెడ్డి ఘాటుగానే స్పందించారు. తాను ఏం చేశానని కాంగ్రెస్ నుంచి బయటకు పంపుతారని సొంత పార్టీ నేతలపైన ఫైర్ అయ్యారు.
జగ్గారెడ్డి త్వరలో దేశరాజధాని ఢిల్లీకి వెళ్లి తనకు ఎదురైన పరిస్థితులను వివరిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే రాజీనామా చేయాలని జగ్గారెడ్డి భావించినప్పటికీ సొంత పార్టీ నేతలు బుజ్జగించారని, ఈ క్రమంలోనే ఆయన తన రాజీనామా ఉపసంహరించుకున్నారని సమాచారం.
సంగారెడ్డి నియోజకవర్గంలోనూ జగ్గారెడ్డి పార్టీ మార్పు గురించి రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి మంత్రులు హరీశ్, కేటీఆర్‌లను కలుసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారని వినికిడి. చూడాలి మరి.. సంగారెడ్డి నియోజకవర్గంలో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో మరి.. హస్తం పార్టీని వీడి కారెక్కేందుకుగాను జగ్గారెడ్డి రెడీ అంటున్నారా లేదా అనేది కొద్ది రోజుల తర్వాత తెలియనుంది.