Rains in telangana: తెలంగాణలో బుధవారం తెల్లవారుజామున జోరు వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచి కొట్టింది. గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. ఈ అకాల వర్షాలతో అన్నదాతలు విలవిల్లాడారు. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో కొనుగోళ్లలో ఎదురవుతున్న జాప్యంతో ధాన్యం ఇంకా మిల్లులకు తరలడం లేదు. జోరు వానకు, ఈదురుగాలులకు మామిడి పిందెలు నేలరాలాయి.
ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నేడు, రేపు రాష్ట్రంని పలు ప్రాంతాల్లో వాన కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కరీంనగర్, జగిత్యా, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం రైతన్నలకు తీవ్ర నష్టం తెచ్చి పెట్టింది. ధాన్యం తడిసిపోగా, మామిడి నేల రాలింది. గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. పిడుగులు విజృంభించడంతో రాష్ట్రంలోని ఒకటీ రెండూ చోట్ల ప్రాణ నష్టం సంభవించింది. మేకలు చనిపోయాయి.
జోరు వానతో విశ్వ నగరం హైదరాబాద్ అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు చేరాయి. పాత బస్తీలోని చాలా ప్రాంతాలు వాన నీటితో నిండిపోయాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్లుపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.