O2 movie review : లేడీ సూపర్ స్టార్ నయన తార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లు ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసలం లేదు. అయితే పెళ్లికి ముందు విఘ్నేష్ దర్శకత్వంలోని వచ్చిన కణ్మని రాంబో కతిజ సినిమా ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఓ2 సినిమాతో నేరుగా ఓటీటీలో సందడి చేస్తోంది. అయితే జీఎస్ విఘ్నేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా జూన్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఓ2 సినిమా ఎలా ఉందో మనం ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
నటీనటులు: నయన తార, రిత్విక్ జోతిరాజ్, భరత్ నీలకంఠన్, తదితరులు, జీఎస్ విఘ్నేస్ దర్శకత్వం వహించగా.. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. తమిళ ఎ అళగన్ సినిమాటోగ్రఫీ చేశారు.
కథ.. ఓ2 సినిమా ఒక థ్రిల్లర్ కథ. పార్వతి (నయన తార) కొడుకు వీర (రిత్విక్ జోతిరాజ్) ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటాడు. ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే ఊపిరి ఆడదు. వీరిద్దరూ అవయవ దానానికి సంబంధించిన ఆపరేషన్ కోసం కొచ్చిన్ నుంచి చిత్తూరు రావాలనుకుంటారు. బస్సులో ప్రయాణిస్తుండగా.. దారిలో వర్షం కారమంగా కొండ చరియలు విరిగి పడి రోడ్డుతో పాటు బస్సు కూడా మట్టిలో కూరుకుపోతుంది. ఈ బస్సు జర్నీలో లేచిపోవాలనుకునే ప్రేమ జంట, మాజీ ఎమ్మెల్యే, పోలీసు, డ్రైవర్ ఇలా ఉంటారు. ఈ ప్రమాదం నుంచి ఎవరెవరు ప్రాణాలతో బయటపడ్డారు, నయన తార తన కొడుకును కాపాడుకోగల్గిందా లేదా అనేది సినిమా. అయితే ఈ విషయాలు తెలియాలంటే మాత్రం కచ్చితంగా సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ.. మనుషులు బతకాలంటే కచ్చితంగా ఆక్సిజన్ కావాల్సిందే. ఈ సందేశంతో ఆక్సిజన్ దొరక్కపోతే మనుషుల మానసిక స్థితి ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. మట్టిలో కూరుకుపోయిన ఒక బస్సు, అందులో విభిన్న మనసత్వాలు ఉన్న వ్యక్తులు ఎలా బతికి బయట పడ్డారనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పాయింట్ ను తెరకెక్కించడంలో డైరెక్టర్ కొంత వరకే సక్సెస్ అయ్యారు. మట్టిలో బస్సు కూరుకుపోయాక వచ్చే సీన్లు బాగున్నాయి. అయితే బస్సు లోయలో పడిపోయిందనే విషయం రెస్క్యూ టీమ్‌కు తెలియడం, తర్వాత వారి చర్యలు అంతా ఆసక్తిగా అనిపించవు. అక్కడక్కడా స్క్రీన్ ప్లే కాస్తా స్లో అయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి తరహాలో వచ్చే సౌత్ ఇండియా సినిమాల్లో క్లైమాక్స్‌ను ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ సన్నివేశాలను మరింత గ్రిప్పింగ్‌గా, కొన్ని మలుపులతో కథ రాసుకుంటే ఇంకా బాగుండేది.
ఎవరెలా చేశారంటే.. నయన తార నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొడుకును కాపాడుకునే తల్లిగా నయన తార చాలా బాగా చేసింది. అనుక్షణం భయం, ప్రేమ వంటి ఎమోషన్లను చాలా బాగా పండించింది. అలాగే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వీర పాత్రలో మాస్టర్ రిత్విక్ జోతిరాజ్ నటన ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లలో రిత్విక్ యాక్టింగ్ హత్తుకునేలా ఉంటుంది. మిగతా నటీనటుల నటన కూడా బాగుంది. విశాల్ చంద్రశేఖర్ బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే బస్సులోని సీన్లు విజువల్‌గా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్‌గా తమిళ్ ఎ. అళగన్ పనితనం చక్కగా కనిపిస్తుంది. ‘దేవుడిచ్చిన లోపాన్ని కూడా.. తల్లి సరిచేయగలదు’ అనే డైలాగ్ ఎమోషనల్‌గా హత్తుకుంటుంది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఒక డిఫరెంట్ థ్రిల్లర్‌ను చూసిన అనుభూతి కలుగుతుంది.
Read Also : Virata Parvam Movie Review : ‘విరాట పర్వం’ మూవీ ఫుల్ రివ్యూ.. సినిమాకు ఇదే హైలెట్..!