Inter exams 2022: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు మొదటి సంవత్సరం ద్వితీయ భాష పరీక్ష జరగనుంది. అయితే ఈ పరీక్షలు ఈనెల 24వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. కానీ ఈనెల 19వ తేదీన ప్రధానమైన పరీక్షలు ముగుస్తాయి. మొదటి సంవత్సరం 4 లక్షల 64 వేల 626 మంది… రెండో సంవత్సరం 4 లక్షల 42 వేల 767 మంది కలిపి… మొత్తం 9 లక్షల 7 వేల 393 మంది పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 వందల 43 పరీక్ష కేంద్రాలను ఇంటర్ బోర్డు సిద్ధం చేసింది.
అంతే కాకుండా 25 వేల 510 మంది ఇన్విజిలేటర్లు, 150 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లు, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. హాల్ టికెట్లను కళాశాల నుంచి ఇవ్వడంతో పాటు నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇంటర్ బోర్డు కల్పించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని… వీలైనంత ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. కొవిడ్ కారణంగా 70శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.