Recce Review: టైటిల్ : రెక్కీ (వెబ్ సిరీస్)
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పోలూరు కృష్ణ
సంగీతం: శ్రీరామ్ మద్దూరి
నటీనటులు: శ్రీరామ్, శివ బాలాజీ, ‘ఆడు కాలమ్ ‘ నరేన్, సమ్మెట గాంధీ, ఎస్తేర్ నోరోన్హా, ధన్యా బాలకృష్ణ, తోటపల్లి
విడుదల తేది: జూన్ 17, 2022- జీ5
రెక్కీ.. పోలూరు కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ. 1992లో తాడిపత్రిలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రెక్కీని తెరకెక్కించాడు దర్శకుడు పోలూరు కృష్ణ. ఈ సినిమా జూన్ 17న జీ5లో విడుదలైంది. 7 ఎపిసోడ్లుగా తెరకెక్కిన రెక్కీ. ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది.. క్రైమ్ థ్రిల్లర్ గా ఏమేరకు న్యాయం చేసిందో తెలుసుకుందాం.
కథ:
తాడిపత్రికి వరదరాజులు (‘ఆడు కాలమ్’ నరేన్) మున్సిపల్ ఛైర్మన్. అదే పట్టణంలో రంగ నాయకులు (రామరాజు) మాజీ మున్సిపల్ చైర్మన్. వీరిద్దరి మధ్య రాజకీయ పోరు జరుగుతూ ఉంటుంది. ఉన్నట్టుండి మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులను కొంతమంది హత్య చేస్తారు. తర్వాత 6 నెలలకు ఆయన కొడుకు కూడా చంపబడతాడు. ఈ హత్యలు చేసింది ఎవరు ? ఎవరు ప్లాన్ చేశారు ? వాటి వెనుక ఉన్నది ఎవరు ? వారిని ఎస్సై లెనిన్ (శ్రీరామ్) కనిపెట్టాడా ? అతను తెలుసుకున్న నిజాలు ఏంటీ అనే అంశాల ఆధారంగా తెరకెక్కిందే రెక్కీ.
విశ్లేషణ:
ఈ మధ్య కాలంలో స్త్రీ వ్యామోహానికి సంబంధించిన చాలా వార్తలు టీవీ ఛానళ్లు, వార్తా పత్రికల్లో రోజూ చూస్తూనే ఉన్నాం. వాంఛ ఎక్కువై కట్టుకున్న భర్తను, కడుపున పుట్టిన పిల్లలను చంపుకుని ప్రియుడితో వెళ్లిపోయే కథలు చాలా వింటూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో సాగుతుంది రెక్కీ వెబ్ సిరీస్. రాజకీయ నేపథ్యం ఉన్న కథలా కనిపించినప్పటికీ వెనక ప్రధాన అంశం మాత్రం స్త్రీ యొక్క వాంఛ. అనుకున్న కథ ప్రకారం ఆద్యంతం ఆసక్తికరంగా ఆవిష్కరించారు డైరెక్టర్ పోలూరు కృష్ణ. బంధాలు, అక్రమ సంబంధాల గురించి చక్కగా చూపించారు.
ఎవరెలా చేశారంటే?
శ్రీరామ్, శివ బాలాజీ, ఆడు కాలమ్ నరేన్, సమ్మెట గాంధీ, ఎస్తేర్ నోరోన్హా పాత్రలు రెక్కీలో హైలెట్ అని చెప్పాలి. శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్ పాత్రలు ఆకట్టుకుంటాయి. తోటపల్లి మధు తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.