Akhanda Movie: బాలయ్యతో నా జర్నీ ఇలాగే సాగాలని కోరుకుంటున్నానని ఎమోషనల్ అయిన బోయపాటి

Akhanda Movie: నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ అందించిన మ్యూజిక్‌కి ఈ సినిమాకు పెద్ద అస్సెట్‌గా నిలిచింది. కరోనా తర్వాత థియేటర్లకు పూర్వ వైభవం కల్పించి, అగ్ర హీరోలకు సైతం నమ్మకం తెప్పించిన సినిమా అఖండ, బాక్సాఫీస్‌ వద్ద రికార్డును బద్దలు కొట్టిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

50 రోజుల వేడుకను జరపడమే అరుదుగా జరుగుతున్న ప్రస్తుత కాలంలో భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టిన అఖండ, తాజాగా 100 రోజులు పూర్తి చేసుకుని మరో రికార్డును బ్రేక్ చేసింది. ఈ సందర్భంగా STBC గ్రౌండ్స్ కర్నూలు‌లో ఈ సినిమా కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హీరో బాలయ్యతో పాటు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, పూర్ణ, శ్రీకాంత్ తదితరులు విచ్చేసి అభిమానులను అలరించారు. ఈ సినిమా విజయవంతంగా 100రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

అఖండ` సినిమాని నందమూరి అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఆదరించడంతోనే ఇంత పెద్ద సక్సెస్ వీలైందని సినీ డైరెక్టర్ బోయపాటి అన్నారు. ఒక మాస్ సినిమాలో నేచర్ గురించి, భగవంతుడు గురించి చెప్పేందుకు అవకాశం వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన ఎమోషనల్‌ అయ్యారు. ఇందులోని సందేశం ఆడియెన్స్‌కి బాగా నచ్చిందని, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఒక సినిమా చూసి నచ్చిందని చెబితే అది ప్రపంచం మొత్తానికి నచ్చుతుందని ఆయన తెలిపారు. `అఖండ` విషయంలో అదే జరిగిందన్న బోయపాటి.. బాలయ్యబాబుతో తన జర్నీ జీవితాంతం ఇంతే సక్సెస్ ఫుల్‌గా, ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాని తన మనసులోని మాటను బయటపెట్టారు బోయపాటి. కాగా ఈ ఈవెంట్‌కు బాలయ్య అభిమానులు వేలాదిగా తరలిరాగా.. 100 రోజుల వేడుక సందర్భంగా స్పెషల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.