ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కమళ్లపూడి వద్ద ఓ యువతి కాబోయే భర్తపైనే దాడి చేసింది. అతడితో పెళ్లి ఇష్టం లేకే.. గొంతు కోసినట్లు నిందితురాలు ఒప్పుకుంది. ఈ విషయాన్ని డీఎస్పీ సునీల్ వెల్లడించారు. మాడుగుల మండలం ఘాట్‌రోడ్డుకు చెందిన అద్దేపల్లి రామానాయుడుకు, రావికమతంకు చెందిన వియ్యపు పుష్పకు.. వివాహ నిశ్చితార్థం జరిగిందని, వచ్చే నెల 20న పెళ్లి జరగాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.
తల్లిదండ్రుల అనుమతితోనే అమ్మాయి, అబ్బాయి కలిసి స్కూటీపై బయటకి వెళ్లారని… వడ్డాది వద్ద స్కూటీ ఆపి గిఫ్ట్ కొంటానని యువతి షాప్‌లోకి వెళ్లిందని తెలిపారు. షాపుకి వెళ్లి తిరిగొచ్చిన ఆమెని.. ఏం కొన్నావని అబ్బాయి అడిగినా చప్పుడు చేయలేదని… అక్కడి నుంచి యువకుడిని విశ్వశాంతి జ్యోతిర్మయి ఆశ్రమం వద్దకు తీసుకెళ్లిందని వివరించారు. బహుమతి ఇస్తా కల్లు మూసుకొమ్మని చెప్పగా… అతను అందుకు ఒప్పుకోలేదు. వెంటనే తన చున్నీని తీసి అబ్బాయి కళ్లకు కట్టింది. ఆపై తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసిందని వివరించారు.
ఆ తర్వాత కళ్లకు ఉన్న చున్నీని తీసి మెడకు చుట్టుకొని అబ్బాయికి ఆస్పత్రికి చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. ఎవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే అమ్మాయి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వివరించారు. దైవ చింతనలో జీవితం గడపాలని ఆ యువతి భావిస్తోందని డీఎస్పీ తెలిపారు. పెళ్లి చేసుకోనంటే పెద్దలు ఒప్పుకోరేమోనని దాడి చేసినట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ పేర్కొన్నారు. యువతిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని డీఎస్పీ సునీల్ మీడియాకు తెలిపారు.