జీవితాంతం తోడుంటానని ఏడడుగులు నడిచి మూడు ముళ్లు వేసిన ఓ వ్యక్తి ఆరు మాసాలకే భార్యను వదిలేసి ప్రియురాలితో ఉడాయించాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన ఆనంగళ్ల మహేష్(30)కు ఖైతాపురం గ్రామానికి చెందిన 26ఏళ్ల యువతితో గత ఏడాది జూన్ 4న వివాహం జరిగింది. అప్పటి నుంచి మహేష్ సదరు యువతితో బాగానే కాపురం చేశాడు.
గత ఏడాది డిసెంబరు 31న భూదాన్‌పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన యువతితో కలిసి బైకుపై పారిపోతూ, దేశ్‌ముఖి వద్ద అదుపుతప్పి కిందపడ్డారు.ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచి మహేష్‌ను అతని కుటుంబ సభ్యులు, ఆ యువతిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. మహేష్ ఈ నెల 10న చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి, ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగిరాలేదు. భీమనపల్లిలో ఆ యువతి కూడా లేదు. దీంతో అతడి భార్య ఈ నెల 13న చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇంత వరకు మహేష్ జాడను కనుగొనలేకపోయారు. దీంతో మహేష్ భార్య మల్కాపురంలోని అతని ఇంట్లోంచి కుటుంబ సభ్యులను బయటకు పంపింది.ఇంటికి తాళం వేసి ఇంటి ఎదుట బంధువులు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం ఆందోళనకు దిగింది.రోజంతా ఇంటి ఎదుటే బైటాయించింది. సాయంత్రం ఎస్‌ఐ మానస వచ్చి చర్చించారు. మహేష్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, తాళం తీసి ఇంట్లోకి వెళ్లాలని, న్యాయం చేస్తానని చెప్పారు. అందుకు ఒప్పుకోని యువతి ఇన్ని రోజులుగా ఎందుకు పట్టుకోలేదని, మహేష్ ఎక్కడుండో కుటుంబ సభ్యులకు తెలుసని పేర్కొంది. నా భర్త నాక్కావాలని, ఎక్కడికి వెళ్లేది లేదని చెప్పింది. గ్రామస్తులంతా ఆమెకు మద్దతుగా నిలిచారు.