Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఉప్పు, నిప్పులా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తాజాగా కలుసుకున్నారు. గతంలో టీపీసీసీ పదవిని రేవంత్‌కు ఇచ్చే సమయంలో కోమటి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడారేవంత్‌కు పలుసార్లు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల యాదాద్రి పర్యటనలోనూ కేసీఆర్ తోనూ సన్నిహితంగా ఫొటోలు దిగారు. దీంతో కోమటిరెడ్డి వ్యవహారం కాంగ్రెస్ తో పాటు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ స్వయగా కోమటిరెడ్డి నివాసానికి వెళ్లారు. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. కాగా కోమటిరెడ్డితో భేటీకి సంబంధించిన ఫొటోలను రేవంత్ ట్విట్టర్‌లో పంచుకుని ‘హ్యాపీటైమ్స్’ అని క్యాప్షన్ జోడించారు.
Happy times…. pic.twitter.com/kWBspwDdBA
— Revanth Reddy (@revanth_anumula) February 15, 2022
అదే విధంగా భువనగిరి ఎంపీ కూడా రేవంత్ తో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు. ‘ఈరోజు రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చారు. ఆయనను సాదరంగా స్వాగతించాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు చర్చించాం. రాబోయే రోజుల్లో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో కాక పుట్టించడం ఖాయం. అందరమూ కలిసి తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాం’ అని కోమటి రెడ్డి పేర్కొన్నారు. కాగా ఇన్నిరోజులూ ఎడమొహం, పెడమొహంలా ఉన్న రేవంత్, కోమటిరెడ్డి ఒకే వేదికపై కనిపించడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో సరికొత్త జోష్ కనిపిస్తోంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World