Shibu Soren Death : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఇక లేరు. జార్ఖండ్ ‘గురూజీ’ లేదా ‘దిషోం గురు’గా ప్రసిద్ధి చెందిన శిబు సోరెన్ (Shibu Soren Death) కన్నుమూశారు. ఆగస్టు 4, 2025న ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు 81 సంవత్సరాలు. చాలా కాలంగా సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే జార్ఖండ్‌తో సహా దేశవ్యాప్తంగా శోకసంద్రం అలముకుంది. (JMM) అంటే.. జార్ఖండ్ ముక్తి మోర్చా స్థాపకుడు. ప్రత్యేక జార్ఖండ్ ఉద్యమ నాయకుడు. అసలు శిబు సోరెన్ ఎలా మరణించారు? ఆయనకు ఏమైందో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Shibu Soren Death : ఢిల్లీ ఆస్పత్రిలో సోరెన్ కన్నుమూత :
జార్ఖండ్ ‘దిషోం గురు’ శిబు సోరెన్ మరణం జార్ఖండ్ రాజకీయాల శకానికి ముగింపు పలికింది. ఆయన ఈరోజు ఉదయం 8.48 గంటలకు ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో మరణించారు. ఆయనను నెఫ్రాలజీ విభాగంలో చేర్చారు. గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
శిబు సోరెన్ చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. 19 జూన్ 2025 నుంచి ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఆయన మరణ వార్త జార్ఖండ్ రాజకీయాల్లో గిరిజన సమాజంలో శోకసంద్రాన్ని నింపింది. ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ తండ్రి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈరోజు తాను శూన్యం అయ్యానని అన్నారు. గురూజీ మనందరినీ విడిచిపెట్టి వెళ్లిపోయారు.
Shibu Soren Passes Away : శిబు సోరెన్ మరణానికి కారణాలివే :
శిబు సోరెన్ అనారోగ్యంతో మరణించారు. ఆయనకు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. సోరెన్ మరణానికి కారణం దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చిందని చెబుతున్నారు. డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు. బైపాస్ సర్జరీ కూడా జరిగింది.
జూలై 2025లో ఆయన ఆరోగ్యంలో స్వల్ప మెరుగుదల కనిపించింది. కానీ, ఆగస్టు ప్రారంభంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమంగా మారింది. దాంతో సోరెన్‌ను వెంటిలేటర్‌పై ఉంచారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించారు. ఆయన కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, భార్య కల్పనా సోరెన్ సహా ఆయన కుటుంబం మొత్తం ఢిల్లీలో ఆయనతో ఉన్నారు.
Dishom Guru : శిబు సోరెన్ ఎవరు? :
వాస్తవానికి, శిబు సోరెన్ జార్ఖండ్ రాజకీయాల్లో ఒక గురూజీ. పిల్లలు లేదా పెద్దలు అనే తేడా లేకుండా అందరూ శిబు సోరెన్‌ను ‘గురూజీ’ అని పిలిచేవారు. జార్ఖండ్‌లోని గిరిజన సమాజాన్ని వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి విముక్తి చేయడానికి ఆయన 1970లలో ఒక ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన తండ్రి సోబరన్ మాంఝీ హత్య ఆయనను సామాజిక, రాజకీయ పోరాట మార్గంలోకి తీసుకువచ్చింది. 1973లో ఆయన JMMని స్థాపించారు.
ఆ తర్వాత జార్ఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా మార్చడానికి దశాబ్దాలుగా పోరాడారు. ఆయన పోరాట ఫలితంగా 2000 సంవత్సరంలో జార్ఖండ్ బీహార్ నుంచి సపరేటు అయింది. శిబు సోరెన్ దుమ్కా నుంచి 8 సార్లు లోక్‌సభ ఎంపీగా, 3 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఆయన 3 సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే, ఆయన పదవీకాలం కూడా వివాదాలతో చుట్టుముట్టింది.