- ఆడపిల్లల కోసం ప్రభుత్వం అందించే అద్భుతమైన SSY స్కీమ్
- ఈ పథకంలో చేరితే చదువులు, పెళ్లినాటికి భారీగా డబ్బులు సంపాదన
- సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఎలా చేరాలి? డాక్యుమెంట్లు ఏంటి?
Sukanya Samriddhi Yojana : మీ ఇంట్లో ఆడ పిల్లలు ఉన్నారా? అయితే మీరే అదృష్టవంతులు.. ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. ఆడపిల్లల భద్రత కోసం సుకన్య సమృద్ధి యోజన (SSY) అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ఆడపిల్లలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆడపిల్లల విద్యతో పాటు భద్రతపరంగా అన్ని సౌకర్యాలను అందిస్తుంది.
బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారంలో భాగంగా 2015 జనవరి 22న ఈ SSY స్కీమ్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ప్రత్యేకించి గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. 2026 జనవరి 22 నాటికి (Sukanya Samriddhi Yojana) ఈ స్కీమ్ అమల్లోకి వచ్చి సరిగ్గా 11 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ పథకం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 4.53 కోట్లకుపైగా సుకన్య సమృద్ధి అకౌంట్లను ఓపెన్ చేశారు.
ఈ పథకంలో ప్రస్తుతం ఏడాదికి 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది బాలికల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్రభుత్వ మద్దతుగల సేవింగ్స్ స్కీమ్. ఇందులో పెట్టుబడి ద్వారా భారీ మొత్తంలో రాబడిన సంపాదించుకోవచ్చు.
ఇందులో పెట్టుబడి పెట్టినవారికి అసలుతో పాటు మొత్తం వడ్డీపై పూర్తిగా గ్యారెంటీని అందిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు. అంతేకాదు.. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో అద్భుతమైన పథకంగా చెప్పవచ్చు. ఆడపిల్లలకు భవిష్యత్తులో ఉన్నత చదువులు, విద్యా ఖర్చులు, వివాహానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.
SSY ఖాతా ఎవరు తెరవచ్చంటే? :
ఆడబిడ్డల కోసం తల్లిదండ్రులు, గార్డియన్స్ ఎవరైనా ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. దేశవ్యాప్తంగా పోస్టాఫీస్ లేదా అధీకృత ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో సుకన్య సమృద్ధి అకౌంట్ తీసుకోవచ్చు. బాలిక పుట్టిన రోజు దగ్గరనుంచి 10 ఏళ్లు నిండేలోపు ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి. ప్రతి ఆడపిల్లకు ఒక అకౌంట్ మాత్రమే ఉంటుంది.
ఒకే కుటుంబంలో ఒకరికి మించి ఆడపిల్లలు ఉంటే గరిష్టంగా రెండు అకౌంట్లు తీసుకోవచ్చు. అయితే, కవల పిల్లలు అయితే ఇందులో మినహాయింపులు పొందవచ్చు. ఈ అకౌంట్ దేశవ్యాప్తంగా ఒక చోట నుంచి మరోచోటకు ఈజీగా ట్రాన్స్ పర్ చేసుకోవచ్చు. బాలికకు 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు లేదా గార్డియన్లు అకౌంట్ మేనేజ్ చేస్తారు. ఆ తర్వాత ఆడపిల్లలే స్వయంగా అకౌంట్ ఆపరేట్ చేసుకోవచ్చు.
Sukanya Samriddhi Yojana : అవసరమైన డాక్యుమెంట్లు ఇవే :
- SSY అకౌంట్ కోసం కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉండాలి.
- అకౌంట్ ప్రారంభ అప్లికేషన్ ఫారమ్
- బాలిక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్
- గార్డియన్ ఆధార్ నంబర్
- పాన్ కార్డు, ఫారం 60 అప్లికేషన్
ఈ SSY అకౌంటులో కనీసం ఏడాదికి రూ. 250 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 15 ఏళ్ల పాటు మాత్రమే డిపాజిట్లు చేయాలి. కానీ, అకౌంట్ మాత్రం వడ్డీతో 21 ఏళ్ల వరకు ఉంటుంది.
వడ్డీ లెక్కింపు ఇలా :
SSY అకౌంటులో జమ అయిన వడ్డీని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో అకౌంటులో వడ్డీని డిపాజిట్ చేస్తారు. ఈ అకౌంట్ ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు ట్రాన్స్ ఫర్ పెట్టుకున్నా లేదా పోస్టాఫీస్‌కు ట్రాన్స్ ఫర్ చేసినా వడ్డీ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
విద్య కోసం విత్‌డ్రా :
ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా టెన్త్ క్లాస్ పాస్ అయ్యాక అకౌంటులో మొత్తంలో 50 శాతం వరకు ఉన్నత విద్య కోసం వాడుకోవచ్చు. ఒకేసారి లేదంటే విడతలవారీగా డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఈ డబ్బులు తీసుకోవాలంటే విద్యకు సంబంధించిన ఖర్చుల వివరాలను చూపించాల్సి ఉంటుంది.
మెచ్యూరిటీ, ప్రీ క్లోజింగ్ ఆప్షన్ :
సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ పొందుతుంది. అయితే, 18 ఏళ్లు నిండిన తర్వాత ఆమె వివాహం జరిగినా లేదా దురదృష్టవశాత్తూ మరణించినా ప్రీ క్లోజింగ్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన మొదటి 5 ఏళ్లలోపు ప్రీ క్లోజింగ్ ఆప్షన్ ఉంటుంది.

