Shani Trayodashi: శనివారం త్రయోదశి తిథి వస్తే ఆ రోజున శని త్రయోదశి అంటారు. ఈ శని త్రయోదశి శనీశ్వరునికి ఎంతో ముఖ్యమైన రోజు అని భావిస్తారు. ఎందుకంటే శని త్రయోదశి తిథిలో జన్మించారు కనుక శని త్రయోదశి రోజు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల ఏలినాటి శని తొలగిపోతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున నేడు శనీశ్వరునికి అభిషేకాలు పూజలు నిర్వహించి దానధర్మాలు చేస్తారు.ఈ క్రమంలోనే శనీశ్వరుని ఆలయానికి వెళ్లి స్వామివారికి నువ్వుల నూనె, నల్లటి నువ్వులతో అభిషేకం చేసిన అనంతరం నీలిరంగు పుష్పాలను సమర్పించి పూజించాలి.
ఈ విధంగా స్వామివారికి నీలిరంగు పుష్పాలతో పూజ చేసి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా శని త్రయోదశి రోజు కాకులకు ఆహారం పెట్టడం వల్ల పితృ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇలా కాకులకు ఆహారంగా పెట్టిన అనంతరం నల్లని వస్త్రంలో నువ్వుల నూనె, నల్లటి నువ్వులను దానం చేయడం వల్ల ఏలినాటి శని తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. ఇకపోతే ఈ శని త్రయోదశి కేవలం శనీశ్వరునికి మాత్రమే ప్రీతికరమైనది కాదు ఈ శని త్రయోదశి శివకేశవులకు కూడా ఎంతో ప్రీతికరమైనది.
అందుకే పెద్ద ఎత్తున శివకేశవులకు కూడా పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం శివకేశవులు అశ్వత్థ వృక్షంలో కొలువై ఉంటారనే విషయం మనకు తెలిసిందే.అందుకే ఈ శని త్రయోదశి రోజున అశ్వర్థ వృక్షానికి వెళ్లి ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఆ శివకేశవుల అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. అందుకే ఎంతో పవిత్రమైన ఈ శని త్రయోదశి రోజున పెద్ద ఎత్తున భక్తులు శనీశ్వర ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించడంతో పాటు అశ్వత్థ వృక్షానికి కూడా పూజలు చేస్తారు.