Woman missing : విశాఖ ఆర్కే బీచ్ లో సోమవారం రోజున గల్లంతు అయిన సాయి ప్రియ ఇవాళ నెల్లూరులో ప్రత్యక్షం అయింది. తన బార్య సముద్రంలో కొట్టుకుపోయిందని ఆమె భర్త నిన్న పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు రెండ్రోజుల పాటు తీవ్రంగా గాలించారు. చివరకు ఇవాళ ఆమెను నెల్లూరులో గుర్తించారు. ఓ యువకుడితో పాటు సాయి ప్రియ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే…?
విశాఖ ఆర్కే బీచ్ లో సోమవారం రోజున తన భార్య సాయి ప్రియ(21) అనే మహిళ గల్లంతు అయినట్లు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి రోజున సరదాగా గడుపుదామని బీచ్ కు వచ్చామని చెప్పాడు. తాను ఫోన్ చూసుకుంటున్న సమయంలో తన భార్య సముద్ర వద్దకు వెళ్లిందని.. అలలతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను కాపాడబోయేలోగా ఆమె కంటికి కనిపించనంత దూరం కొట్టుకెళ్లిందని పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఆచూకీ కోసం కోస్ట్ గార్డుకు చెందిన హెలికాప్టర్, రెండు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.